74 వ గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఢిల్లీ లోని కర్తవ్య పథ్ మార్గ్ అంతటా భారత ఆయుధ సంపత్తిని ప్రదర్శించారు. మెయిన్ బ్యాటిల్ అర్జున్ ట్యాంక్, నాగ్ మిసైల్ సిస్టం, కె-9 వజ్రా, బ్రహ్మోస్ మిసైల్ వంటి అత్యాధునిక శకటాల ప్రదర్శన వావ్ అనిపించింది. ఇవన్నీ దేశీయంగా తయారైనవే.. ఆరు మంత్రిత్వ శాఖలకు చెందిన వివిధ శకటాలు ఆకట్టుకున్నాయి. అలాగే వివిధ రాష్ట్రాల సాంస్కృతిక వికాసాన్ని ప్రతిబింబించే శకటాలు కనువిందు చేశాయి.
మొదట ప్రధాని మోడీ అమరవీరుల స్తూపం వద్ద దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులకు నివాళులర్పించారు. ఆయన వెంట రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉన్నారు. ఈ జాతీయ స్మారకం వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మోడీ సాదరంగా స్వాగతం పలికారు. ఈ గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ పత్వా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పరేడ్ ప్రారంభానికి ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
మొదటిసారిగా కర్తవ్య పథ్ లో రాష్ట్రపతికి 21 శతఘ్నులతో సైనిక వందనం సమర్పించారు. అలాగే తొలిసారిగా ఈ వేడుకల్లో 144 మందితో ఈజిప్టుకు చెందిన మిలిటరీ కంటింజెంట్ బృందం పాల్గొంటోంది.