లెబనాన్ రాజధాని బీరుట్‌లో పేలుళ్ల ఘటన చెన్నైని వణికిస్తోంది. బీరుట్ మాదిరిగానే చెన్నై పోర్ట్‌లోనూ టన్నుల కొద్ది అమ్మోనియం నైట్రేట్ నిల్వలు ఉండంటం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా 740 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఇక్కడి కంటెయినర్లలో నిల్వ చేశారు. 2015 నుంచి ఈ పేలుడు పదార్ధం పోర్ట్‌లోనే నిల్వగా ఉండిపోయింది. కరూర్‌కు చెందిన ఓ సంస్థ అప్పట్లో అనుమతి లేకుండా ఈ పదార్థాన్ని దిగుమతి చేసుకోవడంతో.. కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 36 కంటెయినర్లలో దీన్ని భద్రపరిచారు.
సహజంగానే అమ్మోనియం నైట్రేట్‌కు మండే స్వభావం ఎక్కువ. పైగా ఎక్కువ కాలం నిల్వ ఉంటే ఎంతో ప్రమాదకరం.బీరుట్ పేలుడు ఘటనతో అది రుజవైంది. మరో భయంకరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతంచెన్నై పోర్టులో ఈ పదార్థాన్ని నిల్వ చేసిన కంటెయినర్లు.. ఎప్పడూ రద్దీగా ఉండే సరుకు రవాణా కేంద్రంలో ఉన్నాయి. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే.. కిలోమీటర్ల మేర భారీ విధ్వంసం తప్పుదు. దీంతో చెన్నై పోర్టు పరిస్థితిపై ఆందోళన నెలకొంది. అయితే పోర్టులో సీజ్ చేసిన పేలుడు పదార్థాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పెట్రోలియం, పేలుడు భద్రతా సంస్థ- Petroleum, Explosive Safety Organisation (PESO) పర్యవేక్షిస్తోందని అధికారులు చెబుతున్నారు. దాన్ని సురక్షితంగా ఉంచడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని అనుసరిస్తున్నారని అంటున్నారు.
లెబనాన్‌లో పేలుళ్ల ఘటనను దృష్టిలో ఉంచుకొని.. సాధ్యమైనంత త్వరగా డిస్పోజ్ చేయాలని తమిళనాడులోని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అలస్యం చేస్తే.. ఎప్పటికైనా చెన్నై కూడా మరో బీరుట్‌లా మారక తప్పదని హెచ్చరిస్తున్నాయి.