ఆర్మీ డే సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించారు త్రివిధ దళాధిపతులు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం దగ్గర పుష్పగుచ్చాలు సమర్పించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. గౌరవ వందనం సమర్పించారు.
భారత సైన్యాధిపతి ఎంఎం నరవణె, వాయుసేన చీఫ్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ ఆర్ హరికుమార్ వీర జవాన్లకు నివాళులు అర్పించారు. తర్వాత కరియప్ప పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కవాతులో పాల్గొన్నారు. సైన్యంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు పతకాలు అందజేశారు.
ఆర్మీ డే సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రతకు భరోసా ఇవ్వడంలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోందన్నారు రామ్ నాథ్. సరిహద్దులను రక్షించడంలో, శాంతిని కాపాడడంలో మన సైనికుల నైపుణ్యం, త్యాగం, శౌర్యాన్ని ప్రదర్శిస్తారని చెప్పారు. వారి సేవకు దేశం కృతజ్ఞతలు తెలుపుతోందని తెలిపారు.
మన ధైర్యవంతులైన సైనికులకు వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని మోడీ. వీరుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదని కొనియాడారు. దేశ భద్రత కోసం భారత సైన్యం చేస్తున్న అమూల్యమైన సేవ గురించి చెప్పేందుకు మాటలు చాలవని చెప్పారు.