దేశం, జాతి గొప్పతనాన్ని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రిపబ్లిక్ డే సందర్భంగా గాంధీ భవన్ లో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్.. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. 1930లో జనవరి 26న జవహర్ లాల్ నెహ్రూ తిరంగా జెండా ఎగురవేసి సంపూర్ణ స్వరాజ్యం ప్రకటించారన్నారు. అప్పటినుంచి ప్రతీ సంవత్సరం ఈ సంబరాలను జరుపుకుంటూ బ్రిటిష్ వాళ్లకు ఒక హెచ్చరిక చేశారని గుర్తు చేశారు.
బీఆర్ అంబేద్కర్, నెహ్రూ లాంటి మేధావులు 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేశారని.. దళిత గిరిజన రిజర్వేషన్లు, పేదలకు విద్య, గ్రామ పంచాయతీ వ్యవస్థను రాజ్యాంగం ద్వారా అమలు చేశారన్నారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని తెలిపారు. దేశ ప్రగతికి ఎన్నో ప్రాజెక్టులు, కార్యక్రమాలు కాంగ్రెస్ చేపట్టిందన్నారు. ఇంత అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని.. కొంతమంది అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు.
కాంగ్రెస్ తెచ్చిన విద్యా హక్కును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయన్నారు రేవంత్. విద్యను దూరం చేసి పేదలను మధ్య యుగం వైపు నడుపుతున్నారని మండిపడ్డారు. మోడీ అధికారంలోకి వచ్చాక పబ్లిక్ సెక్టార్ యూనిట్లను ప్రైవేట్ కు అమ్ముతున్నారని ఆరోపించారు. లక్షలాది కోట్ల విలువైన ఆస్తులను చిల్లర ధరకు అమ్ముకుంటున్నారని.. రిజర్వేషన్లను పేదలకు దూరం చేసే కుట్ర జరుగుతోందని చెప్పారు. ఈ కుట్రను తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. 9 ప్రభుత్వాలను కూలదోసి బీజేపీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు.
హత్యలు, హత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికి వర్తింపజేయాలన్నారు రేవంత్. ఎమ్మేల్యే పార్టీ ఫిరాయిస్తే వారి సభ్యత్వం రద్దు చేయాలని.. అవసరమైతే ఉరి తీసే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల పట్ల కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు. ఈ అంశంపై రాజ్యాంగంలో సవరణ తీసుకురావాల్సిన విషయాన్ని మేధావులు ఆలోచించాలని సూచించారు. గణతంత్ర దినోత్సవాన్ని ప్రగతి భవన్, రాజ్ భవన్ కు పరిమితం చేసి.. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు.
ఏళ్లు గడుస్తున్నా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్న ఆయన.. గణతంత్ర దినోత్సవాన్ని జరపాలని హైకోర్టు ప్రభుత్వానికి చెప్పాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రిటీషర్స్ కాలంలో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయని.. జనవరి 30న రాహుల్ కశ్మీర్ లో జాతీయ జెండా ఆవిష్కరించి దేశ సార్వభౌమత్వాన్ని చాటుతారని తెలిపారు. ఆ రోజు అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో పూజలు చేయాలన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభించామన్న రేవంత్.. ఫిబ్రవరి 6 నుంచి 60 రోజులపాటు దీన్ని నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని కోరారు.