భవిష్యత్‌లో రాబోయె యుద్ధాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు సైన్యాన్ని మరింతగా బలోపేతం చేస్తున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. సైనిక దినోత్సవం సందర్బంగా బెంగళూరులో నిర్వహించిన 75వ ఆర్మీ పరేడ్‌కు ఆయన హాజరయ్యారు.
1949 జనవరి 15న బ్రిటీష్ నుంచి భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్‌గా ఫీల్డ్ మార్షల్ కేఎమ్ కరియప్పా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జనవరి 15ను సైనిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది ఆర్మీ డే వేడుకలను పుణె కేంద్రంగా పనిచేస్తున్న సదరన్ కమాండ్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఢిల్లీ వెలుపల ఆర్మీ డేను నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ కార్య్రమంలో పాల్గొని మనోజ్ పాండే మాట్లాడుతూ…. గతేడాది భద్రతా పరమైన సవాళ్లను సైన్యం ఎదుర్కొందన్నారు. ఇప్పుడు వాటిని పూర్తిగా అధిగిమించామన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో మన సైనికులు అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో వారికి కావలసిన పరికరాలను, అన్ని రకాల సదుపాయలను కేంద్రం కల్పిస్తోందన్నారు. స్థానిక ప్రభుత్వాల సహాయాన్ని తీసుకుని ఆ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఉత్తరాది సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులే ఉన్నట్టు వెల్లడించారు. అక్కడ శాంతిని నెలకోల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏదైనా అనుకోని ఘటనలు జరిగినా వెంటనే దాన్ని ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందన్నారు.
ఇప్పుడు జమ్ముకశ్మీర్ ప్రజల్లో చాలా వరకు మార్పు కనిపిస్తోందన్నారు. హింసను వారు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలల్లో కశ్మీర్ ప్రజలు అత్యంత ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. పశ్చిమ సరిహద్దులోని ఎల్ఓసీ వెంబడి కాల్పుల విరమణ కొనసాగుతోందన్నారు. ఆ ప్రాంతాల్లో తీవ్రవాద కార్యకలపాలు ఇంకా అలాగే ఉన్నాయన్నారు. వాటిని అడ్డుకట్ట వేసేందుకు నిరంతరం చర్యలు చేపడుతున్నామన్నారు.