నైజీరియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 76 మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరికొంతమంది గల్లంతయ్యినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన సమయంలో పడవలో సుమారు 85 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నైగర్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్‌బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయినట్లు తెలుస్తోంది. పడవ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, ఇతర విభాగాల సిబ్బందిని రంగంలోకి దింపారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు 76 మృతదేహాలు వెలికితీశారు.ఈ దుర్ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ విచారం వ్యక్తం చేశారు.
పడవలోని ప్రతి ఒక్కరి ఆచూకీ తెలిసే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని బాధితులకు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని సంబంధిత అధికారుల్ని నైజీరియా అధ్యక్షుడు ఆదేశించారు.