అటల్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్ సత్తా చాటింది. గత ఏడాది 19వ స్థానానికి పరిమితమైన ఐఐటీ హైదరాబాద్ ఈ ఏడాది 7వ స్థానం లో నిలిచింది. మొదటి స్థానం ఐఐటీ మద్రాస్ సొంతం చేసుకుంది. ఈ ర్యాంకులను కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ ప్రకటించారు. దేశంలోని యూనివర్శిటీలు, విద్యాసంస్థల పనితీరు.. అవి అందించే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను, అధ్యాపకులు, విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రమాణికంగా చేసుకొని ఈ ర్యాంకులు కేటాయిస్తారు. కేంద్ర విద్యాశాఖ 2018లో ఏఆర్‌ఐఐఏ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటుచేసి అప్పటి నుంచే ఈ ర్యాంకులు ఇస్తుంది. దీంతో, విద్యాసంస్థల్లో పోటీ తత్వం ఏర్పడి వినూత్న ప్రయోగాలకు ఆస్కారం ఉంటుందని విద్యాశాఖ భావిస్తోంది.
2018 నుంచి ఐఐటీ హైదరాబాద్ రెండు సార్లు టాప్‌టెన్‌లో నిలిచింది. 2019లో పదవ ర్యాంక్ రాగా.. 2020లో 19వ ర్యాంక్ ను సరిపెట్టుకుంది. ఈ ఏడాది 7వ ర్యాంక్ సొంతం చేసుకొని సత్తా చాటింది. ఐఐటీ మద్రాస్ వరుసగా మూడోసారి మొదటి స్థానంలో కొనసాగుతోంది.