దోషులం కాదు..నార్కో టెస్ట్‌కు రెడీ !

దేశంలో సంచలనం సృష్టించిన కథువా బాలిక రేప్, హత్య కేసులో 8 మంది నిందితులు తాము దోషులం కాదని, అవసరమైతే తమకు లై డిటెక్టర్ (నార్కో) టెస్ట్ నిర్వహించాలని కోర్టును కోరారు. ఈ కేసులో ఎనిమిదో నిందితుడైన ఓ మైనర్ బాలుడు..చీఫ్ జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.

కథువా లోని కోర్టులో వీరిని ప్రవేశపెట్టినప్పుడు లాయర్లు, పోలీసులతో కోర్టు హాలంతా నిండిపోయింది. ఈ నిందితులకు చార్జిషీటు కాపీలు అందజేయాలని జిల్లా సెషన్స్ జడ్జి సంజయ్ గుప్తా రాష్ట్ర క్రైం బ్రాంచిని ఆదేశించారు. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 28 న జరగాలని నిర్ణయించారు. మైనర్ దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై ఈ నెల 26 న విచారణ జరుగుతుంది.

ఎనిమిదేళ్ళ బాలిక ఆసిఫా రేప్, హత్యా నేరంలో రిటైర్డ్ అధికారి సాంజీ రామ్, దీపక్ ఖజూరియా అనే పోలీసు అధికారి కూడా ఎక్యూజ్డ్‌గా ఉన్నారు. కోర్టులో విచారణ ప్రారంభం కాగానే..సాంజీ రామ్ కూతురు మధుశర్మ కోర్టు బయట నిలబడి నిరసన వ్యక్తం చేస్తూ..తన తండ్రికి ఈ నేరంతో సంబంధం లేదని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

కథువా లోని ఓ ఆలయంలో ఆసిఫా రేప్, హత్యలను సాంజీ రామ్ ప్రోత్సహించాడన్న అభియోగం అతనిపై ఉంది. అటు-తనను క్రైం బ్రాంచి పోలీసులు తీవ్రంగా కొట్టి ఈ నేరం చేసినట్టు అంగీకరించాలని బలవంతపెట్టారని దీపక్ ఖజూరియా అంటున్నాడు. అందుకే నార్కో టెస్టుకు అనుమతించాలని కోరుతున్నట్టు చెప్పాడు. పైగా ఈ కేసుపై సీ బీ ఐ విచారణ జరిపించాలన్నాడు.