టిబెట్‌లో మంచు తుఫాను సంభవించింది. నైరుతి ప్రాంతంలోని నియాంగ్చి ప్రాంతంలో ఈ మంచు తుఫాను ముంచెత్తింది. దీంతో ఎనిమిది మంది మరణించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. సహాయక చర్యల కోసం చైనా ప్రభుత్వం అక్కడికి సహాయ బృందాలను పంపించింది.
మంచులో కూరుకుపోయిన మృత దేహాలను సహాయక బృందాలు వెలికి తీస్తున్నాయి. మెయిన్లింగ్ కౌంటీలోని పాయ్, మెడోగ్ కౌంటీలోని డోక్సాంగ్ ప్రాంతాల మధ్య మంచు తుఫాన్ సంభవించినట్టు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 8గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ మంచు తుఫానులో ప్రజలు, వాహనాలు చిక్కుకుపోయాయని పేర్కొంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. సహాయక చర్యల కోసం ఘటనాస్థలానికి మొత్తం 246 మంది సహాయక సిబ్బందిని చైనా ప్రభుత్వం పంపినట్టు తెలిపింది.
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుంటాయి. ఈ క్రమంలో అక్కడక్కడ మంచు తుఫానులు వస్తుంటాయి. కొండల పై నుంచి మంచు వేగంగా కిందకు జారుతూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న వాహనాలు, ప్రజలు మంచులో చిక్కుకు పోతుంటారు.