వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పదంగా 8 నెమళ్లు మృతి చెంది కనిపించాయి. ఈ ఘటన జిల్లాలోని పర్వతగిరి మండల శివారులో గల దేవిలాల్ తండలో జరిగింది.
తండా చుట్టు ప్రాంతాల్లో నెమళ్లు తిరుగుతుంటాయని స్థానికులు చెప్తున్నారు. అవి ఎక్కువగా వ్యవసాయ క్షేత్రాల్లో కనబడుతుండేవని తండా వాసులు తెలిపారు. గ్రామ శివారులోని పొలాల్లో పురుగుల నివారణ, వరి ఎదుగుదల కోసం రైతులు గులుకల మందు చల్లిన నీటిని తాగడంతో మృతి చెంది ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు.
స్థానికులు వెంటనే వెటర్నరీ డాక్టర్ కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డాక్టర్ ఘటనా స్థలానికి చేరుకోని మృతి చెందిన నెమళ్లను పోస్ట్ మార్టంకు తరలించారు. రిపోర్ట్ ఆధారంగా వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.
అయితే.. అవి ప్రమాదావశాత్తు మరణించాయా లేక ఎవరైనా వేటగాళ్ళు కావాలనే విషం పెట్టి చంపేసి ఉంటారా అనే కోణంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు పోలీసులు.