పల్నాడు జిల్లా చిలకలూరి పేటకి చెందిన బాలుడి కిడ్నాప్ ఘటన సుఖాంతమయ్యింది. చిలకలూరి పేటలో బాలుడి కిడ్నాప్ ఘటన స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. రాజీవ్ సాయి అనే 8 ఏళ్ల బాలుడిని దుండగులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. సాయి తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారి కాగా.. దసరా పండుగ కావడంతో బాలుడి కుటుంబం చిలకలూరి పేట వచ్చింది. చిలకలూరిపేట 13వ వార్డులో ఆలయంలో రాజీవ్ సాయి తల్లిదండ్రులు పూజలు చేస్తున్నారు.
ఈ క్రమంలో దేవాలయం వద్ద ఆడుకుంటున్న బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. రాజీవ్ సాయి ఎంతకూ కనిపించక పోవడంతో బాలుడి తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడిని వదలాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ తండ్రికి ఫోన్ చేశారు కిడ్నాపర్లు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అయితే కొద్ది సేపటికి బాలుడు నెల్లూరు జిల్లా కావలి వద్ద సురక్షితంగా బయట పడ్డాడని తెలిసింది. బాలుడిని దుండగులు కారులో వదిలి పరారయ్యారు. స్థానికులు బాలున్ని గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఈ బాలుడి చిలకలూరి పేటలో కిడ్నాప్ కు గురైన రాజీవ్ సాయిగా గుర్తించారు పోలీసులు. దీంతో రాజీవ్ ను కావలి నుంచి చిలకలూరి పేట తీసుకెళ్లారు.
రాజీవ్ సాయి క్షేమంగా దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాలుడి క్షేమ సమాచారాన్ని విన్న పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. అయితే రాజీవ్ సాయిని ఎవరు కిడ్నాప్ చేశారన్నది తెలియాల్సి ఉంది. బాలుడి కుటుంబం గురించి తెలిసిన వారెవరైనా ఈ పని చేసి ఉంటారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కిడ్నాప్ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.