దేశవ్యాప్తంగా గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు,వరదలు మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించాయి. వరదల వల్ల రాష్ట్రం వ్యాప్తంగా దాదాపు 84 మంది మరణించారు. 66 మంది గాయపడ్డారు. ముంబై, థానే, కొంకణ్ ప్రాంతం, గడ్చిరోలి జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
గడ్చిరోలి జిల్లాలో వరదల కారణంగా 249 గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. వరదల వల్ల నిర్వాసితులైన ప్రజలకోసం ఇప్పటికే 35 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు అధికారుల అంచనా ప్రకారం.. 44 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా,1368 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దాదాపు 180 జంతువులు మృత్యువాత పడ్డాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం,జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 5,968 మందిని తరలించాయి.
గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని డ్యామ్ రిజర్వాయర్లు సగానికి పైగా నిండాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉపముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి ప్రజలకు అన్ని విధాల అందుబాటులో ఉంటూ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.