గతేడాది రెండో అర్ధభాగంలో మాలీలో జరిగిన హింసాత్మక ఘటనల్లో 886 మంది పౌరులు మరణించినట్టు యునైటెడ్ నేషన్స్ మల్టీడైమెన్షనల్ ఇంటిగ్రేటెడ్ స్టెబిలైజేషన్ మిషన్(మినుస్మా) ఓ ప్రకటనలో పేర్కొంది.
బాధితుల్లో 40 మంది పిల్లలు, 65 మంది మహిళలు ఉన్నట్టు మినుస్మా వెల్లడించింది. అయితే గతేడాది మొదటి అర్ధభాగంతో పోలిస్తే హింసకు గురైన బాధితుల సంఖ్య రెండో అర్ధభాగంలో స్వల్పంగా 7శాతం తగ్గినట్టు నివేదిక తెలిపింది.
గ్రూప్ ఫర్ ది సపోర్ట్ ఆఫ్ ఇస్లాం అండ్ ముస్లిమ్స్ వంటి గ్రూపులకు ఆపాదించబడిన మానవ హక్కుల ఉల్లంఘనలు మునుపటి కాలంతో పోలిస్తే 21 శాతం పెరిగినట్టు నివేదిక పేర్కొంది.
హింస దేశం మధ్యలో కేంద్రీకృతమైందని, ముఖ్యంగా బండియాగరా, డౌయంట్జా, మోప్టి, సెగౌ ప్రాంతాల్లో దక్షిణ ప్రాంతాల వైపు మళ్లిందని నివేదిక వెల్లడించింది.
2012 నుండి భద్రత, రాజకీయ, ఆర్థిక రంగాల్లో తీవ్రమైన సంక్షోభాన్ని మాలి ఎదుర్కొంటోంది. ఇక్కడ స్వాతంత్ర్య తిరుగుబాట్లు, జిహాదీల చొరబాట్లు, అంతర్గతంగా ఉన్న కమ్యూనిటీల హింస వల్ల వేలాది మంది మరణించారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.