నారద లంచం కేసు, శారద చిట్ ఫండ్ కుంభకోణాల నుంచి బయటపడకముందే.. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో అవినీతి మచ్చ పడింది. ఈస్ట్రర్న్ కోల్డ్‌ఫీల్డ్ లిమిటెడ్‌కు చెందిన గనుల్లో బొగ్గు అక్రమ తవ్వకాలు, రవాణకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల్లో టీఎంసీ ఎంపీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, రాష్ట్ర మంత్రి మొలోయ్ ఘటక్ సహా రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. అయితే వీరిందరి మధ్యలో ఈ స్కాంలో ఓ వ్యక్తి పేరు ప్రముఖంగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రూ . 1900 కోట్ల కుంభకోణంలో అనూప్ మాఝీ అలియాస్ లాలా అనే పారిశ్రామికవేత్తదే ప్రధాన హస్తంగా తేలడంతో అందరి చూపు ఆయనపై పడింది. ఈ కమ్రంలో అనూప్ మాఝీ గురించి ఆరాతీస్తోంటే.. విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి.
8 తరగతి మధ్యలోనే మానేసిన అనూప్ మాఝీ.. ఈ కోల్ స్కామ్‌లో బిగ్‌షాట్ అని తేలడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బొగ్గు అక్రమ తవ్వకాలు, రవాణ చేయడంలో సిద్ధహస్తుడైన మాఝీ.. కోట్ల రూపాయల ముడుపులను వివిధ రాజకీయ నేతలు, అధికారులకు ముట్టజెప్పినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఒకప్పుడు బొగ్గును దొంగిలించి అమ్ముకునేవాడని, అలా భారీగా కూడబెట్టి ఆపై.. నేరుగా లంచాలు ఇస్తూ తన దందాను కొనసాగించి ఇప్పుడు ప్రముఖ వ్యక్తిగా మాఝీ చెలామణి అవుతున్నాడని అధికారులు చెబుతున్నారు.
ఈస్ట్రర్న్ కోల్డ్‌ఫీల్డ్ లిమిటెడ్‌లో బొగ్గు కుంభకోణంపై గత నవంబర్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది. కంపెనీకి చెందిన ఇద్దరు మేనేజర్లు, సెక్యూరిటీ చీఫ్, మరో ప్రైవేట్ వ్యక్తి సహా ఆరుగురు వ్యక్తుల పేర్లను సీబీఐ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది. ఇందులో మాఝీ పేరును ప్రముఖంగా ప్రస్తావించింది. ఇప్పటివరకు ఈ కేసులో 597 ఎఫ్ఐఆర్‌లు, 28 మందిని అరెస్ట్ చేశారు. మాఝీ గ్రామం భమురియాలోని అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా.. రూ.9 కోట్ల డబ్బు దొరికింది. అలాగే పలు అనుమానాస్పద ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు చిక్కాయి. వాటిని విశ్లేషిస్తే.. మాఝీ ఇప్పటివరకు రూ.1300 కోట్లు వివిధ నేతలు, ఉన్నతాధికారులకు ముడుపులుగా చెల్లించినట్టుగా బయటపడింది.ఈస్ట్రర్న్ కోల్డ్‌ఫీల్డ్ లిమిటెడ్ కార్యకలపాలు సాగే అన్ని చోట్ల.. అక్కడి నుంచి బొగ్గు తరలే అన్ని మార్గాల్లో మాఝీకి గట్టి పట్టుందని గుర్తించారు. తన అక్రమ వ్యాపారం కోసం ఏకంగా 700 ట్రక్కులను కొనుగోలు చేసి పెట్టుకున్నాడని కనుగొన్నారు.
ఇదిలా ఉంటే మాఝీకి చెందిన గ్రామంలోని స్థానికులు ఆయనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. మాఝీ చాలా మంచివాడని, సామాజిక సేవ చేస్తాడని, ఎంతో మందికి తన కంపెనీల్లో ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నాడని అంటున్నారు. అతనికి అక్రమాలు చేయాల్సిన అవసరం లేదని, అతనికే అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయని చెబుతున్నారు. ఎవరైనా అతని గురించి ఆరాతీయడానికి వస్తే.. విసుక్కుంటున్నారు.