పశ్చిమ బెంగాల్ లో కల్తీ సారాకు తొమ్మిది మంది బలయ్యారు. హౌరా జిల్లా గుసురీ ప్రాంతంలో కల్తీ సారా సేవించిన ఘటనలో తొమ్మిది మంది మరణించగా, 20 మందికిపైగా అస్వస్థతతకు గురయ్యారు.
దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సారా తాగిన కొద్ది సేపటికే చాలా మంది వాంతులు చేసుకున్నారు. దీంతో వారిలో చాలా మంది అనారోగ్యానికి గురై ఇంట్లోనే మరణించారు.
మలిపంచ ఘోర ప్రాంతంలో ప్రతాప్ కర్మాకర్ అనే వ్యక్తి అక్రమంగా లిక్కర్ షాపు నడుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఆ షాపులోనే బస్తీవాసులు అక్కడే మద్యం సేవించారని, ఈ క్రమంలో కొందరు మరణించారని పోలీసులు పేర్కొన్నారు. మరికొందరిని ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.