వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డ్ సృష్టించింది. కేవలం 9 గంటల్లోనే 2 కోట్లకు పైగా టీకాలు పంపిణీ చేసింది ఆరోగ్యశాఖ. ప్రధాని మోడీ బర్త్ డే సందర్భంగా 20 రోజులపాటు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది బీజేపీ. వాటిలో వ్యాక్సిన్ సేవ ఒకటి. దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టింది. అర్హులైన ప్రతీఒక్కరు టీకా వేయించుకోవాలని.. అదే మోడీకి ఇచ్చే అసలైన గిఫ్ట్ అవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే టీకా పంపిణీ జోరుగా కొనసాగుతోంది.
శుక్రవారం 2 కోట్లకు పైగా టీకాలు పంపిణీ చేశారు. ఒక రోజులో ఇన్ని టీకాలను పంపిణీ చేయడం ఇదే మొదటిసారి. దీంతో వ్యాక్సినేషన్ లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 79కోట్ల మందికి పైగా టీకాల పంపిణీ జరిగింది. వచ్చే నెల నాటికి వంద కోట్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆరోగ్యశాఖ.