జైన సన్యాసిగా మారిపోయింది వజ్రాల వ్యాపారి ముద్దుల కూతురు. ఈ తొమ్మిదేళ్ల చిన్నారి సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి ధనేష్-అమీబెన్ దంపతులు కుమార్తె దేవాన్సీ. బుధవారం ఉదయం 6 గంటలకు జైన సన్యాసం దీక్ష స్వీకరించింది. నిజానికి దీక్షా మహోత్సవం నాలుగు రోజుల క్రితం ప్రారంభమైంది. బుధవారం జైనాచార్య కీర్తియాశ్సూరీశ్వర్ మహరాజ్ సమక్షంలో దీక్ష చేపట్టింది.
ఈ చిన్నారికి ఐదు భాషల్లో పరిజ్ఞానం ఉంది. సంగీతంతో పాటు స్కేటింగ్, మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్, భరతనాట్యంలో ప్రావీణ్యురాలు. వైరాగ్య శతకం, తత్వార్థ అధ్యాయ్ వంటి గ్రంథాలను కంఠస్థం చేసింది. తమ కుమార్తె జైన మతంలో నిషేధించిన వాటిని ఏనాడూ ఉపయోగించలేదని, కనీసం టీవీ కూడా చూడలేదని తల్లి అమీ బెన్ చెప్పారు.
మత సంబంధ పరిజ్ఞానంతో పాటు క్విజ్‌లో ఎప్పుడూ దేవాన్షీదే పైచేయి అని తెలిపారు. చిన్ననాటి నుంచే జైన మతం ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులపై అవగాహన పెంచుకున్నదని, సన్యాస దీక్ష తీసుకోవడం తమ కుటుంబం అదృష్టమని అమీబెన్, ధనేష్ చెప్తున్నారు.
ఈ చిన్నారి దీక్షా కార్యక్రమాన్ని వీక్షించేందుకు సూరత్, పరిసర గ్రామాల నుంచి దాదాపు 35 వేల మంది తరలివచ్చారు. దేవాన్షీ వర్షిదన్ యాత్ర సూరత్ లోనే జరిగింది. ఈ యాత్రలో 4 ఏనుగులు, 20 గుర్రాలు, 11 ఒంటెలు పాల్గొన్నాయి. అంతకుముందు దేవాన్షీ వర్షిదన్ యాత్ర ముంబై, ఆంట్ వెర్ప్ లో కూడా జరిగింది.