దారివెంట పోతుంటే ఒక పాము కనిపిస్తేనే వణికిపోతుంటాం. కానీ.. ఎకే సారి వందల సంఖ్యలో పాములు కనిపిస్తే.. అది ఏ అడవిలోనో కాకుండా.. మనుషులు నివసిస్తున్న ఇంట్లో చీమల కుప్పలాంటి పాముల కుప్ప కనిపిస్తే ఆ ఇంట్లో నివసించే వారి పరిస్థితి ఏంటి..? తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా..! కానీ.. నిజంగానే అది ఫేస్ చేసిన వారి పరిస్థితి ఏంటి..?
అలాంటి ఘటనే ఉత్తర్ప్రదేశ్ లో చోటు చేసుకుంది. అంబేడ్కర్ నగర్ జిల్లాలోని మదువానా గ్రామంలోని ఓ ఇంట్లో పాత కుండలో పాములు బయటపడ్డాయి. కోబ్రా జాతికి చెందిన పాములు 90 వరకు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
మనుషులు తిరిగే ఇంట్లో విషసర్పాలు ప్రత్యక్షమవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. విషసర్పాలను బంధించి పట్టుకెళ్లారు. వాటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు.
అయితే.. ఒకేచోట భారీగా పాములు కనిపించటంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఇంతటితో సర్పాలన్నింటినీ అధికారులు పట్టుకెళ్లారా..? ఇంకా మిగిలి ఉన్నాయా..? అనే అనుమానంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు.