ప్రముఖ ఒడిస్సీ నృత్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గురు మాయాధర్ రౌత్(91)ను ప్రభుత్వ వసతి గృహం నుంచి బయటకు పంపించారు అధికారులు. హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేయించి ఇంట్లోని సామాన్లను బయటపెట్టి అవమానకరంగా ప్రవర్తించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రౌత్ కుమార్తె మధుమితా రౌత్ దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రానికి కళాకారులంటే గౌరవం లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా ఢిల్లీలోని ఏషియన్ గేమ్స్ విలేజ్‌లో ప్రభుత్వం కేటాయించిన ఒక వసతి గృహంలో రౌత్ ఉంటున్నారు.
2014లో వీటిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిసులు కూడా జారీ చేసింది. కళాకారులంతా కోర్టుకు వెళ్ళినప్పటికీ.. ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో చాలా మంది తమ బంగళాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు.
ఎలాంటి ఆస్తులు లేని రౌత్ మాత్రం అక్కడే ఉండిపోయారు. దీనితో అధికారులే స్వయంగా వచ్చి తనని ఖాళీ చేయాలని హెచ్చిరంచారు. అంతే కాకుండా అతని వస్తువులన్నింటినీ రోడ్డు మీద పడేశారు. అందులో ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ పురస్కార పత్రం కూడా ఉంది. అయితే.. రోడ్డుపై కన్పించిన పురస్కార పత్రాన్ని చూసి అందరు ఆశ్చర్యపోయారు.