మంకీపాక్స్ విజృంభిస్తోంది. సుమారు 12 దేశాల్లో మంకీ పాక్స్ కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకు సుమారు 92 కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రపంచ దేశాలను హెచ్చరించింది.
‘పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. మంకీపాక్స్ ఇన్ ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నాము. దీంతో ఆయా దేశాలు తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి’ అని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
ఈ వైరస్‌ను మొదట కోతుల్లో గుర్తించారు. అందువల్ల దీనికి మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఇటీవల అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, తొమ్మిది ఐరోపా దేశాల్లో మంకీపాక్స్ తొలి కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వ్యాధితో ఇప్పటి వరకు ఎవరూ మరణించకపోవడం ఉపశమనం కలిగించే విషయం.
బ్రిటన్, పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాటు ఐరోపాలోని బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్ దేశాల్లోనూ కేసులు వెలుగుచూస్తున్నాయి.