భారత్‌పై కరోనా వైరస్ దండయాత్ర చేస్తోంది. సెకండ్ వేవ్.. డెడ్ వేవ్‌లా విరుచుకుపడుతోంది. ప్రభుత్వం, ప్రజలు ఉమ్మడి నిర్లక్ష్య ఫలితమా లేక.. కరోనా వైరస్ తీవ్రతే మరింత పెరిగిందా తెలియడం లేదు. ఇప్పటిదాకా గతేడాది మనదేశంలో నమోదైన కేసుల రికార్డులతోనే ఈ ఏడాది కేసులను పోల్చుకుంటూ వస్తున్నాం.. కానీ ఇప్పుడు కరోనా కేసుల్లో ఏకంగా ప్రపంచ రికార్డులనే బద్దలు కొడుతోంది ఇండియా.
గత 24 గంటల్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలో 93,249 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్‌లోనూ ఒక్కరోజు వ్యవధిలో ఈ రేంజ్‌లో కేసులు బయటపడలేదు. అయితే మరణాల సంఖ్య మాత్రం నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గింది. నిన్న 700కు పైబడి ప్రాణాలు కోల్పోగా.. ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం 513 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు.
దేశంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 1,24,85,509కి చేరింది. కొత్తగా 60,048మంది కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీలు 1,16,29,289కు చేరాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య మొత్తం 1,64,623కు పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,91,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగానే సాగుతోంది. నిన్న 27.38 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు.. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి 7,59,79,651కి చేరింది.