దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు 80పైసలను చమురు కంపెనీలు గురువారం పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది పది రోజుల్లో తొమ్మిదవ సారి కావడం గమనార్హం.
దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరకు రూ. 101.81, డీజిల్ ధర రూ. 93.07కు చేరుకుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు 84పైసలు పెరిగి రూ. 116.72, రూ. 100.94లకు చేరాయి.
సుమారు 137 రోజుల పాటు నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మార్చి 22న ఒక్కసారిగా పెంచారు. ఇక అప్పటి నుంచి వాటి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 6.40 వరకు పెరిగింది.
దేశంలో పెట్రోల్ ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న చమురు ధరలే ఇందుకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ‘ మెహంగాయ్-ముక్త్ భారత్ అభియాన్’ పేరిట మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు దేశ వ్యాప్త నిరసనలను కాంగ్రెస్ పార్టీ చేపట్టనుంది.