మిలియన్ మార్చ్… తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకై ఢిల్లీని హెచ్చరించిన కార్యక్రమం. తెలంగాణ స్వపరిపాలన కోరుకుంటుందని, ప్రజాస్వామ్య దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా… సవతి తల్లి ప్రేమతో బ్రతకలేం అని జరుగుతున్న స్వరాష్ట్ర ఉద్యమంలో మిలియన్ మార్చ్ గట్టిగా చాటింది.
పార్టీలు కాదు… నేతల రాజకీయాలు కాదు… తమది ప్రజా పోరాటం అని చాటిన కార్యక్రమం మిలియన్ మార్చ్. టీఆర్ఎస్, టీడీపీ,కాంగ్రెస్, బీజేపీ ఇలా పార్టీల నేతలంతా ప్రజలతో కలిసి వచ్చిన కార్యక్రమం అది. పార్టీలు కాదు, ప్రభుత్వాలు కాదు ప్రజల ఆకాంక్ష నెరవేరాలని జేఏసీ చైర్మన్ గా కోదండరాం ఇచ్చిన పిలుపుతో కదిలిన తెలంగాణ ఉద్యమకారుల కావాతు అది. ఓ దశలో ఉద్యమానికి ప్రతీకగా చెప్పుకున్న టీఆర్ఎస్ కూడా అందరిలో ఒకరిగా కార్యక్రమంకు రావాల్సి వచ్చింది.
అరబ్ లో తేహ్రీ స్క్వేర్ ముట్టడి స్ఫూర్తిగా తీసుకున్న ఈ కార్యక్రమం విజయవంతం కాకుండా కోదండరాంను ముందే అరెస్ట్ చేశారు. కేసీఆర్ అయితే మిలియన్ మార్చ్ కు కనీసం బయలుదేరనే లేదు. హరీష్ రావు ఒక్కడే బోటు సహయంతో రాగలిగాడు. కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ ప్రజలతో కలిసి వచ్చారు. దీంతో తప్పనిసరై కేసీఆర్ కార్యక్రమం చివర్లో ట్యాంక్ బండ్ చేరుకోగా… మహిళలు విమర్శలతో స్వాగతం పలికారు.
ప్రభుత్వం నిర్బంధాలు, హౌజ్ అరెస్టులు, హెచ్చరికలు, బాష్పవాయువు గోళాలు, పారామిలటరీ దళాలు, పోలీసుల దాడులు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను తెలిపే మిలియన్ మార్చ్ ను అడ్డుకోలేకపోయాయి సరికదా… విజయవంతం చేసేందుకు కారణమయ్యాయి. ఎక్కడి నుండి వస్తున్నారో తెలియకుండానే… ప్రభుత్వ పెద్దలను షాక్ గురి చేస్తూ జనం ఉప్పెనలా ట్యాంక్ బండ్ పైకి వచ్చారు. మిలియన్ మార్చ్ ను విజయవంతం చేశారు. జనాన్ని చూసిన పోలీసులు కనీసం ఆపే ప్రయత్నం చేయలేదంటే ఎంత మంది వచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఇసుక వేస్తే రాలనంత జనం… జై తెలంగాణ నినాదాలతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.
అంతా జేఏసీ ద్వారా కోదండరాం ఈ కార్యక్రమం చేశారని… అందుకే కేసీఆర్ కానీ తెలంగాణ సర్కార్ కానీ మిలయన్ మార్చ్ ను గుర్తు చేయవన్న విమర్శలున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన మిలియన్ మార్చ్ కు 10 సంవత్సరాలు పూర్తయ్యాయి.