నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా ఈ మానవ మృగాల ఆగడాలు ఆగడం లేదు. వయస్సు, వాయి వరసలు మరిచి పశువుల్లా ప్రవర్తిస్తూ.. ఆడ పిల్లల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. తన మనువరాలు వయసున్న ఓ బాలికపై కన్నేశాడో దుర్మార్గుడు. పాఠశాలనుండి ఇంటికి వెళ్తున్న 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే.. మేడ్చల్ జిల్లాలో మార్చి 31న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. మార్చి 31న పాఠశాల ముగిసిన తర్వాత సదరు బాలిక తన స్నేహితురాళ్లతో కలిసి ఇంటికి వెళ్తోంది. అదే సమయంలో బాలికకు పరిచయస్తుడైన ఆటో డ్రైవర్ వెంకటయ్య అటుగా వచ్చాడు. తన ఇంటి వద్ద దిగబెడతానని ఆమెను నమ్మించి ఆటోలో ఎక్కించుకుని వెళ్లాడు. బాలిక ఆటోలో ఎక్కడం స్కూల్ టీచర్ గమనించారు. దానికి తోడు బాలిక స్నేహితురాళ్లు అదే విషయాన్ని స్కూల్ టీచర్ కు చెప్పారు.
దీంతో అనుమానం వచ్చిన ఆ టీచర్.. మరోసటి రోజు నిన్ను ఆటోలో ఎక్కించుకెళ్లిన వ్యక్తి ఎవరూ.. ఎక్కడికి తీసుకెళ్లాడని ప్రశ్నించింది. కంగారుపడ్డ బాలిక జరిగిన విషయాన్ని టీచర్ కు పూసగుచ్చినట్టు చెప్పింది. వెంటనే బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరించిన స్కూల్ టీచర్.. ఆటోడ్రైవర్ పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సూచించింది. అయితే.. ఈ విషయంలో బాలిక తల్లిదండ్రులు కాస్త అవమానంగా, భయంగా ఫీలయ్యారు. ఎక్కడ విషయం పోలీసుల వరకు వెళ్తే తమ పరువుపోతుందోనని భావించి సైలెంట్ గా ఉన్నారు.
కాగా.. ఘటన జరిగి ఐదు రోజుల తర్వాత స్కూల్లో టీచర్ బాలికను సోమవారం అదే విషయంపై ప్రశ్నించింది. ఆటోడ్రైవర్ పై కేసు పెట్టారా అని అడగింది. లేదని బాలిక సమాధానం చెప్పడంతో మరోసారి తన బాధ్యతగా తల్లిదండ్రులను స్కూల్‌కి పిలిపించుకుంది. చిన్నారిపై అఘాయిత్యం చేసిన అలాంటి కామంధుడ్ని వదిలిపెడితే ఇలాగే మరో అమాయకురాలు బలవుతుందని వారికి అర్ధం అయ్యేలా చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మేడ్చల్ పోలీసులను ఆశ్రయించారు.
బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆటో డ్రైవర్ వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో బాలిక చెప్పిందంతా నిజమే అని తేలడంతో.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు వెల్లడించారు. కాగా.. డబ్బు ఎరగా చూపి తనపై అత్యాచారం చేసినట్లు ఆ బాలిక వెల్లడించింది. ఇలాంటి దుర్మార్గులను ఉరితీయాలంటూ.. మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.