తెలంగాణ ఉద్యమంతో పతాక స్థాయికి చేరుకొని, వరుసగా రెండు ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించిన సీఎం కేసీఆర్ కు 2020 సంవత్సరం మాత్రం చుక్కలు చూపించింది. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడవకముందే రాజకీయంగా గడ్డుకాలం ప్రారంభం అయ్యింది.
రాజకీయ పునరేకీకరణ అంటూ ప్రత్యర్ధి పార్టీల్లో నాయకులు లేకుండా చేసే ప్రయత్నం చేసినా… ఏమాత్రం వర్కవుట్ కాలేదు. ఒక్కసారి ప్రజల్లో అసంతృప్తి మొదలైతే ఎలా ఉంటుందో 2020 ఏడాది శాంపిల్ చూపించిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కేసీఆర్ ఇచ్చిన కొత్త హామీలు నెరవేర్చేందుకు కరోనా లాక్ డౌన్ దెబ్బతీసింది. 1000కోట్లు అయినా ఖర్చు చేస్తానని ఇచ్చిన ప్రకటనలు, ఎమ్మెల్యే సీతక్కపై వ్యంగ్యంగా వైరస్ మనదాక రాదు అంటూ హేళన చేసిన మాటలతో మొదలైన అసంతృప్తి ఏడాదంతా కొనసాగింది.
కరోనా వైరస్ నివారణ, టెస్టులు చేయటం, సరైన చికిత్స అందించటంలో ఫెయిల్ అయిన ఘటనలు వరుసగా తెరపైకి వచ్చాయి. దీంతో కేసీఆర్ సర్కార్ ఎంతో అప్రతిష్ట మూటగట్టుకోవాల్సి వచ్చింది. కోర్టులైతే విచారణ జరిగిన ప్రతిసారి మొట్టికాయలు వేసింది. ఇక రాజకీయంగా దుబ్బాక ఉప ఎన్నికతోనే కేసీఆర్, టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు ప్రారంభం అయ్యాయి. తిరుగే లేదని అనుకున్న సిద్ధిపేటకు ఆనుకొని ఉన్న దుబ్బాకలో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. మాయ మాటలు కాదు… ఇక చేతలు కావాలి అంటూ టీఆర్ఎస్ కు బుద్ధిచెప్పారు.
ఇక టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి… 100సీట్లు గెలుస్తామన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది. కనీసం సొంతగా మేయర్ పీఠాన్ని గెల్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎన్నికల వరకు బీజేపీ ఫైర్ అయిన కేసీఆర్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లొచ్చారు. అప్పటి వరకు రైతు ఉద్యమానికి మద్ధతు పలికి, బంద్ కు సహాకరించి, కొత్త చట్టాలను వ్యతిరేకించిన ఆయన… ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. దీంతో కేసీఆర్ మాటల వ్యక్తేనన్న విమర్శలు రెట్టింపు కాగా, మూడో ఫ్రంట్ అంటూ హాడావిడి చేసిన కేసీఆర్ కు బెంగాల్ సీఎం మమత షాక్ ఇవ్వటం కూడా జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఓవరాల్ గా… 2020 ఏడాది ఎదురే లేదనుకున్న కేసీఆర్ మెడలు వంచిందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.