ప్రపంచవ్యాప్తంగా గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్ ఓఎస్, యాపిల్ కు చెందిన ఐఓఎస్ అత్యంత ఆదరణను పొందాయి. ఐఓఎస్ కేవలం యాపిల్ ఉత్పత్తులకే పరిమితమైనప్పటికీ.. ఆండ్రాయిడ్ ఓఎస్ ను అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలు వాడుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కు ప్రత్యామ్నాయంగా స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు.
స్వదేశీ స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారుచేసేందుకు ఆయా పరిశ్రమల కోసం పర్యావరణ వ్యవస్థను మరింత సులభతరం చేసే విధానాన్ని ప్రభుత్వం రూపొందించనున్నట్లు తెలుస్తోంది. స్వదేశీ హ్యాండ్ సెట్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించడానికి ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నట్లు రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. వీటికి పోటీగా పలు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ అంతగా ప్రభావాన్ని చూపలేకపోయాయి. దీంతో గూగుల్, యాపిల్ కు చెందిన ఆపరేటింగ్ సిస్టమ్స్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో పాతుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ను తీసుకువస్తే.. గూగుల్, యాపిల్ కంపెనీలకు భారీ దెబ్బ తగిలే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు.
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీకి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ఇంతకు ముందే ప్రకటించింది. దేశీ తయారీని పెంచేందుకు ఇది చాలదని.. విదేశాల్లో తయారై ఇక్కడకు దిగుమతి అవుతున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై సుంకాలను పెంచాలని పరిశ్రమ కోరుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రి తీసుకొచ్చే బడ్జెట్ లో తమ డిమాండ్లకు చోటు కల్పిస్తారని పరిశ్రమ భావిస్తోందని నిపుణులు చెప్పుకొస్తున్నారు.