అతి వేగంతో వస్తున్న కోళ్ల వ్యాన్ ఒకటి అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న కోళ్లన్ని రోడ్డు మీద, పక్కన ఉన్న పొలాల్లో పడ్డాయి. దీనిని గమనించిన స్థానికులు కోళ్ల కోసం ఎగబడ్డారు. అసలే బండి తిరగబడి కోళ్లన్ని చెల్లాచెదురయ్యాయని అతను బాధపడుతుంటే దొరికిందే సందని కోళ్లను ఎత్తుకుపోయారు ప్రజలు.
అసలేం జరిగిందంటే… మెదక్ జిల్లాలో కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం బోల్తా పడింది. అది కోళ్లను తీసుకుని వెళ్తున్న వాహనం కావడంతో కోళ్లన్ని కిందపడిపోయాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకొని కోళ్లను పట్టుకునే పనిలో పడ్డారు.
కొన్ని కోళ్లు వరి పొలంలో పడటంతో.. వరి పైరు పొట్టకొచ్చింది అని కూడా చూడకుండా ప్రజలు కోళ్లను పట్టుకునే పనిలో ఉన్నారు. రోడ్డుపై వెళుతున్నవాళ్లు.. తమ బైక్లను పక్కనపెట్టి మరీ కోళ్లను పట్టుకోవడానికి పాట్లు పడ్డారు. దొరికినవాళ్లు దొరికినట్లు కోళ్లను ఎత్తుకుపోయారు.
కొందరైతే..ఒక కోడితో సరిపెట్టుకోలేకపోయారు. రెండు చేతుల్లో మూడు నాలుగు కోళ్లను ఎత్తుకెళ్లారు. జనం కోళ్ల కోసం ఎగబడితే.. రైతు మాత్రం కోళ్ల కోసం తమ వరి పొలాన్ని పాడుచేశారని మండిపడ్డాడు.