– రణరంగంగా మారిన సరిహద్దు
– బాంబులతో బెంబేలెత్తుతున్న ప్రజలు
– ఉన్నత చదువులకు పోయి చిక్కుకున్న తెలంగాణ విద్యార్ధులు
– స్వస్థలాలకు తరలించాలని వేడుకుంటున్న విద్యార్ధులు
– తమ పిల్లలను రక్షించాలంటున్న తల్లి దండ్రులు
– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్ధుల పాలిట శాపంలా మారింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది విద్యార్ధులు అక్కడ చిక్కుకుని అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణకు చెందిన చాలా మంది విద్యార్థులు ఉక్రెయిన్ లో చదువుకుంటున్నారు. అయితే.. రష్యా యుద్ధం ప్రారంభించడంతో.. దిక్కుతోచని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే భయంతో భీకర బాంబుల శబ్ధాల మధ్య.. గదుల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. తమను ఎలాగైనా స్వస్థలాలకు పంపించాలని భారత రాయబార కార్యాలయ అధికారులను వేడుకుంటున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యమైనంత త్వరగా తమను స్వస్థలాలకు తీసుకురావాలని హైదరాబాద్ కర్మన్ ఘాట్ కు చెందిన వైతరిణి విజ్ఞప్తి చేశారు. నిత్యావసర సరుకులు లేక.. ఏవైనా కొనాలన్నా డబ్బులు లేక.. డబ్బులు డ్రా చేద్దామని వెళ్తే ఏటీఎంలు పనిచేయక అనేక ఇబ్బందులను చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లాలని కోరుకుంటున్నామని వైద్య విద్యార్థిని వైతరిణి కోరుతున్నారు.
మరోవైపు.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న పిల్లల కోసం తల్లిదండ్రులు వాపోతున్నారు. నిజామాబాద్ కు చెందిన మేధ.. బోధన్ కు చెందిన వినయ్.. కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన రాహుల్.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్నట్లు కుటుంబసభ్యులు చెప్తున్నారు. అంతేకాకుండా నస్రుల్లాబాద్ కు చెందిన సచిన్ గౌడ్.. భీంగల్ మండలానికి చెందిన నితిన్, చరణ్ లు భారత రాయబార కార్యాలయంలో తలదాచుకున్నట్టు సమాచారం. వీరంతా హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి అక్కడ ఉద్యోగం చేస్తున్నారని వారివారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన దుర్గాప్రసాద్.. కార్గివ్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. గజ్వేల్ మండలం వేల్పూరు కు చెందిన ప్రవళిక, కొండపాకకు చెందిన అజిత్, జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ కు చెందిన నిహారికరెడ్డి వైద్య విద్య అభ్యసిస్తున్నారు. ప్రస్తుతానికి తానున్న ప్రాంతంలో ఎలాంటి అలజడులు లేవని నిహారికరెడ్డి చెప్తున్నారు.
8 నెలల కిందట ఉక్రెయిన్ లోని కంపెనీలో పనిచేసేందుకు వెళ్లిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం మేదరిమెట్ల చెందిన వైనాల రాజు… కీవ్ నగరంలో తమకు సమీపంలోనే బాంబు దాడి జరిగిందని కుటుంబ సభ్యులకు చెప్పి ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఇసుక మేరికి చెందిన అమూల్య.. వినిష్టాలో ఎంబీబీఎస్ చదువుతోంది. తాము నివసిస్తున్న పట్టణంలోని పరిస్థితులను కుటుంబ సభ్యులకు చెప్పుకొని భయభ్రాంతులకు లోనవుతోందని తల్లిదండ్రులు చెప్తున్నారు. తాముంటున్న ప్రాంతానికి కొంచెం దూరంలోనే బాంబులు పేలుతున్నాయని చెప్పిందని అంటున్నారు.
భువనగిరికి చెందిన చెన్న గౌరీ శంకర్ కుమారుడు.. పృథ్విరాజ్ ఉక్రెయిన్ లో చిక్కుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ధైర్యంగా ఉండాలని.. తల్లిదండ్రులు కుమారుడికి భరోసా కల్పించామని అన్నారు. వీలైనంత త్వరగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పిల్లల్ని రప్పించాలని కోరుతున్నారు. అయితే.. వాయు మార్గం నిలిచిపోవడంతో.. కనీసం రోడ్డు మార్గంలోనైనా తమను పక్క దేశాలకు తరలించాలని ఉక్రెయిన్ లోని తెలంగాణ విద్యార్థులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.