రాచకొండ పోలీస్ కమిషనరేట్ లోని అబ్దుల్లా పూర్ మెట్ పోలీసు స్టేషన్లో దారుణం చోటుచేసుకుంది. ఒక ప్రియురాలి కోసం ఇద్దరు యువకుల మధ్య గొడవ హత్యకు దారి తీసింది. ప్రియురాలు తనకు దక్కకుండా పోతుందన్న భయంతో ఓ యువకుడు మరో యువకుడిని అత్యంత దారుణంగా హత మార్చి..అబ్దుల్లా పూర్ మెట్ గుట్టల్లో పడేశాడు.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళితే.. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతున్న నవీన్ ,హరిహరలు అక్కడే చదువుతోన్న ఓ యువతిని ప్రేమిస్తున్నారు. దీంతో ఎలాగైనా ఆ యువతిని దక్కించుకోవాలని పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో హరిహర తాను ప్రేమిస్తున్న ప్రేయసీ ఎక్కడ నవీన్ కు దగ్గరవుతుందేమోనని.. భయ పడ్డాడు.
దీంతో ఎలాగైనా..నవీన్ ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. పార్టీ చేసుకుందామని నవీన్ ను నమ్మించి హైదరాబాద్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి.. తాగించి..అత్యంత దారుణంగా హతమార్చాడు. అబ్దుల్లా పూర్ మెట్ గుట్టల్లో అతడి మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. అయితే ఈ నెల 17 నుంచి నల్లగొండలో నవీన్ మిస్ అయినట్టు ఫిర్యాదు నమోదైంది.
మరో వైపు పోలీసుల విచారణలో హరిహరే నవీన్ ను చంపినట్టుగా తేలింది. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ గుట్టల్లోంచి నవీన్ డెడ్ బాడీని రికవర్ చేసిన పోలీసులు పోస్ట్ మార్టం కోసం తరలించారు. అయితే తాను ప్రేమించిన యువతిని నవీన్ కూడా ప్రేమించడంతోనే అతడిని హత్య చేసినట్టుగా హరిహర పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్టు సమాచారం. ఇక ఇలా ఉంటే.. ఈ సమాచారాన్ని బయటకు రానివ్వకుండా గోప్యంగా ఉంచుతున్నారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు.