సూర్యాపేట్ నేషనల్ హైవే పై క్షణాల్లోనే పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మునగాల మండలం దగ్గర ఇందిరా నగర్ జాతీయ రహదారిపై వెళుతున్న ఆర్టీసీ రాజధాని బస్సును ఓ స్కూటీ వచ్చి ఢీ కొట్టింది. దీంతో బస్సుతో పాటు స్కూటీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతై పోయింది.
ఈ ప్రమాదంలో ఓ ప్రాణం పోగా.. బస్సులోని ప్రయాణికులు సకాలంలో స్పందించడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయట పడ్డారు. ఇక వివరాల్లోకి వెళితే..ఆర్టీసీ బస్ రాజధానిని ఓ స్కూటీ వచ్చి ఢీకొట్టింది. తరువాత ఆ స్కూటీ కాస్త బస్సు కిందకు దూసుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో అప్పటి వరకు బస్సులో నిద్రమత్తులో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
భయబ్రాంతులతో ఆర్తనాదాలు పెడుతూ.. బస్సు నుంచి బయటికి పరుగులు తీశారు. అయితే అప్పటికే స్కూటీకి అంటుకున్న మంటలు బస్సుకు కూడా వ్యాపించాయి. దీంతో క్షణాల్లోనే స్కూటీతో పాటు బస్సు కూడా దగ్ధమై పోయింది. ఇక గాయాలపాలైన స్కూటీ వాహనదారుడిని ఆసుపత్రికి తరలిస్తుండగానే అతను ప్రాణాలు విడిచాడు.
ప్రమాద సమయంలో బస్సులో 10 మందే ఉండడంతో పాటు వారు సకాలంలో బస్సు నుంచి బయట పడడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసింది. అయితే ఈ ప్రమాదంతో నేషనల్ హై వే పై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.