తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. ధర్మవరం నుంచి తిరుపతి పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు.. సుమారు 300 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ ఘటన చంద్రగిరి మండలం బాకరాపేట ఘాట్ రోడ్డులో చోటుచేసుకుంది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉండగా.. ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు. ఘటన స్థలానికి చేరుకొని.. రెడ్ శ్యాండిల్ టాస్క్ఫోర్స్, ఫైర్ సిబ్బంది, స్థానికులు సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో చిక్కున్న క్షతగాత్రులను బయటకు తీస్తున్నారు. 10 అంబులెన్స్‌లలో గాయలైన వారిని స్థానికి ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో 6మంది మృతి చెందగా.. హాస్పిటల్ లో ఒకరు మృతి చెందినట్టు తెలిపారు. అయితే.. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు పేర్కొన్నారు.
అనంతపురం ధర్మవరానికి చెందిన మలిశెట్టి మురళి అనే పట్టు చీరల వ్యాపారి.. తన కొడుకు నిశ్చాతార్థం కోసం చిత్తూరు జిల్లాకు బంధువులతో కలిసి శనివారం బయలుదేరారు. తన కుమారుడు మలిశెట్టి వేణు (25)కు పుత్తూరుకు దగ్గరలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయించారు. ఆదివారం నిశ్చితార్థ కార్యక్రమానికి బయలుదేరగా.. శనివారం అర్ధ రాత్రి సమయంలో భాకరాపేట ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా పడినట్టు అధికారులు వెల్లడించారు.