దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు అరుణ్ పై కేసు నమోదైంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సయ్యద్ నగర్ లో తప్పతాగి ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు.
పెట్రోలింగ్ పోలీసులు అరుణ్ కారును వెంబడించి పట్టుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అరుణ్ మద్యం సేవించి ఉంటాడని భావించి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు.
పరీక్షల్లో అరుణ్ మద్యం సేవించినట్టు తేలింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కాకుండా రెండు వాహనాలను ఢీకొట్టినందుకు 185, 336 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అరుణ్ పై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి. దాసరి మరణం తర్వాత అన్నదమ్ముల ఆస్థి గొడవల నేపథ్యంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అలాగే తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ఓ వ్యక్తి అరుణ్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు. ఇలా పలు కేసులు అతడిపై ఉన్నాయి. ఇప్పుడు ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదైంది.