జూబ్లిహిల్స్ అమ్నేషియా పబ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నేరస్తులను పప్పించేందుకు పోలీసు వ్యవస్థ ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ.. అత్యాచార ఘటనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను దుబ్బాక ఎమ్మెల్చే రఘునందన్ రావు మీడియా సమక్షంలో బయటపెట్టారు. గ్యాంగ్ రేప్ బాధితురాలి ఏ ఐడెంటిటీని బయటపెట్టరాదన్న సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ను అతిక్రమించినందుకు ఐపీసీ 228 ఏ సెక్షన్ కింద ఆయనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందుకు సంబంధించి కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఈ కేసులో ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోవాలన్నా.. ఆయనపై కేసు నమోదు చేయాలన్నా.. అసెంబ్లీ స్పీకర్ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. కాగా.. స్వయంగా న్యాయవాది అయిన రఘునందన్ రావు ఆ ఫోటోలలో ఆ బాలిక ముఖం, ఇతర గుర్తులు కనిపించకుండా జాగ్రత్త పడ్డట్టు వెల్లడించారు. మొత్తం కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టం కావడంతో.. పాక్షికంగానే బయటపెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. ఈ ఫోటోలను బయట పెట్టకపోయి ఉంటే కీలక నిందితులు తప్పించుకునే వారని చెప్పారు.
కాగా.. మరోసారి షీ టీమ్స్ పోలీసుల సమక్షంలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక వాంగ్మూలాన్ని తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫోటోలను బాలికకు చూపించి ఇందులో ఉన్న వారి వివరాలను సేకరించినట్టు తెలుస్తోంది. కొంత మందిని గుర్తించి తనపై లైంగిక దాడికి పాల్పడిన వారి వివరాలను ఆ బాలిక తన వాంగ్మూలంలో వివరించినట్లు సమాచారం.
అమ్నీషియా పబ్ నుంచి బెంజి కారులో తీసుకువెళ్లిన క్షణం నుంచి తనపై కారులో ఉన్న నలుగురు అసభ్యంగా ప్రవర్తించారని.. అందులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడని ఆమె చెప్పినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే కుమారుడిని ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఎఫ్‌ఐఆర్ లో చేర్చేందుకు సిద్ధమైన పోలీసులు.. న్యాయపరమైన సలహా తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అయితే.. రఘునందన్ రావు బలమైన సాక్ష్యాలను బయట పెట్టడంతో ఇప్పుడు ఎమ్యెల్యే కొడుకును కూడా నిందితుడిగా చేర్చక తప్పడం లేదని విమర్శలను పోలీసులు ఎదుర్కొంటున్నారు. అయినా.. కీలక నిందితులను పట్టుకోవడంలో మీనమేషాలు లెక్కపెడుతూ.. వారు నగరం నుండి వెళ్లిపోయేందుకు అవకాశం కల్పించిన యంత్రాంగం ఇప్పుడు కీలక సాక్ష్యాధారాలు బయటపెట్టిన రఘునందన్ రావుపై ఇప్పుడు కేసు నమోదు చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.