ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా ఆడవాళ్లపై జరుగుతున్న ఆఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. ప్రతీరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఘోరం జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో బాలికను నమ్మించి.. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.
వివరాల్లోకి వెళ్తే.. మలక్ పేట్ ప్రాంతానికి చెందిన ఆమన్ ఖాన్(26) ప్రైవేట్ ఉద్యోగి. అతడికి కార్ఖానాకు చెందిన బాలిక స్నాప్ చాట్ ద్వారా పరిచయమైంది. తరుచూ మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో తనను ప్రేమిస్తున్నట్టు బాలికను నమ్మించాడు అమన్.
ఈ నేపథ్యంలోనే ఆ బాలికను రెండు సార్లు హోటల్ రూంకు తీసుకెళ్లి మైనర్ పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఆమన్ ఖాన్ తో పాటు.. అతనికి సహకరించిన మనోహర్(30), నాగుల్ మీరా(28)లను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.