అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై కేసు నమోదైంది. ఈ ఘటనపై అంబర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మొదట న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు. అనంతరం ఆ మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
సీఆర్పీసీ 174 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ అంబర్‌పేట్‌కు చెందిన ప్రదీప్(5) తన తండ్రితో కలిసి ఆయన పని చేసే ప్రాంతానికి ఆదివారం వెళ్లారు. అక్కడ తన తండ్రి పనిలో బిజీగా ఉండటంతో అక్కడికి సమీపంలోనే వున్న తన సోదరి దగ్గరికి ప్రదీప్ నడుచుకుంటూ వెళ్లాడు.
ఆ సమయంలో కుక్కలు ప్రదీప్ వెంటపడ్డాయి. వాటికి భయపడి అక్కడి నుంచి పరుగులు తీశాడు. దీంతో కుక్కలు అతని వెంటపడ్డాయి. ఒకదాని తర్వాత ఒకటిగా బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. కాళ్లు, చేతులను లాగడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
అనంతరం బాలున్ని అతని తండ్రి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ బాలుడు అప్పటికే మరణించాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఘటన సంచలనంగా మారింది.