తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ రాక్షస పాలనకు మరో యువకుడు బలయ్యాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. సిరిసిల్లకు చెందిన నవీన్ అనే యువకుడు గత కొంత కాలంగా గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు.
కాగా ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా పలు పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అలాగే గ్రూప్ 1 పరీక్షను రద్దు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన నవీన్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే యువకుడి ఆత్మహత్యకు తెలంగాణ ప్రభుత్వమే కారణమన్నారు రేవంత్.
కేసీఆర్ పై హత్యా నేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కోటి పరిహారం ఇవ్వాలని కోరారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని మీకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పై పోరాటం చేద్దామని ఇన్ స్టాగ్రామ్ వేదికగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాగా పేపర్ లీక్ కారణంగా ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్.. నిన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో ప్రిలిమ్స్ రాసిన 2.86 లక్షల మంది అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. కాగా, ప్రిలిమ్స్ ఫైనల్ కీ ని జనవరి 13న కమిషన్ రిలీజ్ చేయగా.. ఇందులో 25,050 మంది అర్హత సాధించారు. వీరంతా జూన్ లో మెయిన్స్ పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు.
ఈ పరిస్థితిలో కమిషన్ వాటిని రద్దు చేసి మరోసారి జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా జూనియర్ లెక్చరర్ పరీక్షను కూడా అధికారులు వాయిదా వేశారు. దీంతో ఎగ్జామ్ పేపర్ లీకేజీ వ్యవహారంలో మొత్తం మూడు పరీక్షలను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ.