కోతులకు భయపడి పరుగులు పెట్టిన ఓ ఏడేళ్ళ బాలుడు ప్రమాదవశాత్తు 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. పొలంలో తోటి స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లిన ఆ బాలుడు తెరిచి ఉన్న బోరు బావిలో పడిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
ఇక విషయం తెలుసుకున్నకుటుంబ సభ్యులు.. గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది.. సహాయక చర్యలు ప్రారంభించారు. పోలీసుల ప్రకారం.. విదిశా జిల్లాలోని లటేరీ ప్రాంతంలోని ఆనంద్ పుర్ గ్రామానికి చెందిన లోకేశ్ అహిర్వార్ ప్రమాదవశాత్తు 60 అడుగుల బోరు బావిలో పడిపోయాడు. లోకేశ్ తోటి స్నేహితులతో కలిసి పొలాల్లో ఆడుకుంటున్న క్రమంలో ఒక్కసారిగా ఆ ప్రాంతానికి కోతుల గుంపు వచ్చింది.
వాటిని చూసి ఆ చిన్నారులు.. భయాందోళనకు గురై పరుగులు పెడుతున్న క్రమంలో లోకేశ్ తెరిచి ఉన్న బోరు బావిలో పడిపోయాడు. దీంతో మూడు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. లోపల ఉన్న చిన్నారి కోసం ఆక్సిజన్ ను పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. బాలుడితో మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాని బాలుడు మాట్లాడే పరిస్థితుల్లో లేడని.. ప్రస్తుతం 43 అడుగుల లోతులో చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
చిన్నారిని కాపాడేందుకు 5 జేసీబీలతో ఆ బోరు బావి చుట్టూ తవ్వడం ప్రారంభించారు. ప్రస్తుతం దాదాపు 40 అడుగుల లోతు తవ్వగలిగామని, త్వరలోనే బాలుడిని కాపాడుతామని అధికారులు తెలిపారు. మరో వైపు తమ బిడ్డ కోసం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.