వనదేవతలు సమ్మక్క సారలమ్మలను అవమానించారని చినజీయర్ స్వామిపై ఆదివాసీ వర్గాలు భగ్గుముంటున్నాయి. ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఆదివాసీల ఆడబిడ్డల చరిత్ర తెలియని జీయర్ స్వామికి వారి గురించి మాట్లాడే హక్కు లేదని డివిజన్ అధ్యక్షుడు మల్లు దొర అన్నారు. కులపిచ్చితో జనాల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న చరిత్ర చిన జీయర్ దని విమర్శించారు. అడవి బిడ్డలపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చినజీయర్ స్వామికి చెందిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో వన దేవతలు సమ్మక్క సారలమ్మను అవమానించేలా మాట్లాడారు. వాళ్లేమన్నా బ్రహ్మలోకం నుంచి దిగొచ్చారా? ఎవరు వాళ్లు.. అడవి దేవతలు.. పూజలు చేస్తే చేసుకోండి.. తర్వాత అక్కడ బ్యాంకులు ఏర్పడ్డాయి.. పెద్ద బిజినెస్ గా మారిపోయిందని అని అన్నారు చినజీయర్.
ఈ వ్యాఖ్యలపై ఆదివాసీ సంఘాలు, నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రా చినజీయర్ తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద అహంకారపూరితంగా మాట్లాడారని మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. సమ్మక్క, సారలమ్మ గురించి తేలిగ్గా మాట్లాడడం సబబు కాదన్నారు సీపీఐ నేత నారాయణ. చినజీయర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని లేకపోతే న్యాయపోరాటం చేస్తామని అంటున్నాయి ఆదివాసీ సంఘాలు.