పెళ్లయిన కొద్ది సంవత్సరాలకే ఏవో చిన్న చిన్న గొడవలు వచ్చి విడాకులు తీసుకున్న జంట..మళ్లీ దాదాపు 52 సంవత్సరాల తరువాత లోక్ అదాలత్ సాయంతో కలిసింది. ఇంతకీ ఎవరు ఆ జంట..? ఎందుకు విడిపోయారు?ఎందుకు కలిసారో తెలుసుకోవాలంటే…ఇది చదివేయండి!
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో బాసప్ప అగడి(85),కల్లవ అగడి(80) అనే ఓ జంట పెళ్లైన కొత్తలోనే విభేధాలతో విడిపోయారు. విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి బాసప్ప.. కల్లవకు భరణం ఇస్తున్నాడు. అలా దాదాపు 52 సంవత్సరాలు గడిచిపోయాయి.
అయితే కొద్ది నెలలుగా బాసప్ప భరణం ఇవ్వడం ఆపేశారు. దీంతో కల్లవ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును తీవ్రంగా తీసుకున్న న్యాయస్థానం.. లోక్ అదాలత్లో పరిష్కారించాలనుకుంది. అయితే న్యాయమూర్తి ఈ వృద్ధ జంటను చూసి షాక్ అయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో మళ్లీ కలిసి జీవించేందుకు వారు ఒప్పుకున్నారు.
మైసూర్లో విడాకులు తీసుకుని శాశ్వతంగా విడిపోవాలనుకున్న మొత్తం 38 జంటలను లోక్ అదాలత్ ద్వారా తిరిగి కలిపారు. భార్యభర్తల మధ్య రాజీ కుదిర్చి వారు కొత్త జీవితాన్ని ప్రారంభించేలా చేశారు. శనివారం ఈ కార్యక్రమం జరిగింది.
మైసూర్ సిటీ, తాలూకా కోర్టుల్లో మొత్తం 1,50,633 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వాటిలో 70,281 కేసులు రాజీ ద్వారా పరిష్కృతం కానున్నాయి. వీటిలో భాగంగానే కొన్ని కుటుంబ గొడవలను కూడా పరిష్కరించారు.