ఆఫ్ఘనిస్తాన్ రాజధాని తాలిబన్ల నియంత్రణలోకి వచ్చినప్పటి నుండి అనేక భయంకరమైన దృశ్యాలు బయటకు వస్తున్నాయి. తాలిబన్ల పరిపాలన నుంచి వందలాది మంది పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కాబూల్ విమానాశ్రయం మూసివేసే ముందు అక్కడ నిలిచిపోయిన టాక్సీలు, ప్రజలు కాబూల్ నుండి బయలుదేరే చివరి విమానాలను ఎక్కడానికి ప్రయత్నించడంతో జరిగిన తొక్కిసలాట, గందరగోళ పరిస్థితులకు సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. అందులో కొంతమంది గాలిలోకి ఎగిరిన విమానం నుంచి కింద పడి మరణించడం బాధాకరం.
ఆగస్టు 17న మరొక హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఇది కాబూల్ విమానాశ్రయంలో జరిగిన గందరగోళానికి సంబంధించిందే. ఈరోజు సోషల్ మీడియాలో ప్లాస్టిక్ క్రేట్‌లో ఓ చిన్నారి ఏడుస్తూ కన్పించడం అందరినీ కదిలించి వేసింది. అనారోగ్యంతో ఉన్న శిశువు 7 నెలల వయస్సు గల పాప ఒక్కతే ఏడుస్తూ కన్పించింది. ఆమె తల్లిదండ్రులు నిన్న జరిగిన గందరగోళంలో కనిపించకుండా పోయారని తెలుస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్ లోని ఒక న్యూస్ ఏజెన్సీ ప్రకారం శిశువు తల్లిదండ్రులు పిడి-5, కాబూల్‌లో నివసిస్తున్నారని, ఆ పాపను తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడానికి వారు సహాయం చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న పరిస్థితులను అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ అగ్ర రాజ్యాలపై, అంతర్జాతీయ ఏజెన్సీలపై ఫైర్ అవుతున్న నెటిజన్లు ఈ పిక్ బాధించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లు మానవ విపత్తుపై మౌనం వహించడంలో అర్థం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.