భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఏడాదికి ఒకసారి అత్యంత వైభవంగా నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ శ్రీరామనవమి ముహూర్తాన్ని ఖరారు చేసింది.ఈ మేరకు బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను ఆలయ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ రెండో తేదీ నుంచి 16 వరకు పదిహేను రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శివాజీ తెలిపారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ 10న, మహా పట్టాభిషేకం వేడుకను 11వ తేదీన నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఏప్రిల్ 10న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఏప్రిల్ 2న ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం, తిరువీధి సేవలు ప్రారంభం కానున్నాయన్నారు. ఏప్రిల్ 6న ఉత్సవ మూర్తులకు విశేష స్నపనం, ఉత్సవ అంకురార్పణ, 8న అగ్నిప్రతిష్ట, 9న ఎదుర్కోలు ఉత్సవం, ఏప్రిల్ 11న శ్రీరామచంద్ర స్వామి పట్టాభిషేకం నిర్వహించనున్నట్టు తెలిపారు.
కోవిడ్ ఆంక్షలను ప్రభుత్వం సడలించడంతో మిథిలా స్టేడియంలో వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీరామనవమి వేడుకలు జరపాలని కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. కానీ.. ముందు భవిష్యత్తు దృష్ట్యా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాన్నారు.