తన అవినీతిని బయట పెట్టిన తోటి ఉద్యోగిపై ఓ ప్రభుత్వ వైద్యుడు దాడికి దిగాడు. ఇద్దరి మనుషులను అతని ఇంటికి తీసుకొని వెళ్లి మరీ గొడవ చేశారు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా పాల్వంచలో చోటు చేసుకుంది. టేకులపల్లి మండలం సులానగర్ పీహెచ్సీలో డాక్టర్ రాజశేఖర్ గతంలో పని చేసేవారు. ఆ సమయంలో ఆయన కంటివెలుగు పథకానికి సంబంధించిన రూ. 2.50 లక్షలను సొంత అవసరాలకు వాడుకున్నారనే ఆరోపణలతో రెండు నెలలు సస్పెండ్ అయ్యారు.
ప్రభుత్వ నిధులను పక్కదోవ పట్టించిన విషయాన్ని తనతో పాటు సీనియర్ అసిస్టెంట్‌గా పని చేసిన సత్యప్రసాద్ బయటపెట్టారు. ఉన్నతాధికారుల విచారణలో ఇది నిజం అని తేలడంతో రాజశేఖర్ సస్పెన్షన్ కి గురి అయ్యారు. రెండు నెలల తరువాత జగన్నాథపురం పీహెచ్‌సీకి ఆయన బదిలీ అయ్యారు. అటు అతని అవినీతిని బయటపెట్టిన సత్యప్రసాద్ జగిత్యాలకు ట్రాన్స్ ఫర్ అయ్యారు.
అయితే.. సత్యప్రసాద్ పై కక్షకట్టిన రాజశేఖర్ అదును కోసం ఎదురు చూశాడు. ఇటీవల సత్యప్రసాద్.. పాల్వంచకు వచ్చినట్లు తెలుసుకున్న ఆయన దాడికి దిగాడు. ఏకంగా తనతో పాటు మరో ఇద్దరిని తీసుకెళ్లి భౌతికదాడి చేశారు. కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. లెక్క చేయలేదు.
దీంతో.. సత్యప్రసాద్ కుటుంబ సభ్యులు ఈ ఘటనని వీడియో తీశారు. మళ్లీ ఇది పెద్ద ఇష్యూ అవుతుంది ఏమో అని భయపడిన రాజశేఖర్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇదంతా ఈ నెల16న జరిగినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై సత్యప్రసాద్ పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్, కొత్తగూడెం డీఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.