మనుషులకంటే ఎక్కువ కుక్కలకు విశ్వాసం ఉంటుందని చెప్తుంటారు పెద్దలు. కుక్కకున్న విశ్వాసం కూడా లేదు అని తిడుతుంటారు. పెంపుడు కుక్కలు మనుషుల పట్ల ఎంత విశ్వాసంగా ఉంటాయో అందరికి తెలుసు. వాటికి తిండి పెట్టి పోషించే యజమానులకు ఎటువంటి ఆపద వాటిల్లినా.. కుక్కలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రక్షించేందుకు ప్రయత్నిస్తాయి. ఆమాటకొస్తే.. ప్రమాదంలో ఉన్న ఏ జీవినైనా.. కుక్కలు రక్షించేందుకు వెనకాడవు. అందుకు ఈ ధృష్యాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఒక చిన్న జింక పిల్లను ఓ పెంపుడు కుక్క రక్షించిన తీరు అందరిని అబ్బురపరుస్తోంది. ఆ కుక్క చేసిన పనికి నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న ఓ కాలువలో జింక పిల్ల చిక్కుకుంది. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా దాని వల్ల కాలేదు. నీటి వేగానికి కొట్టుకుపోతున్న దాన్ని ఓ వ్యక్తి గమనించాడు. వెంటనే తన పెంపుడు కుక్కను నీటిలోకి వదిలాడు. దాంతో ఆ కుక్క వేగంగా వస్తున్న నీటి ప్రవాహంలో ఈదుకుంటూ వెళ్లి.. ఆ జింక పిల్లను నోటతో కరుచుకుని ఒడ్డుకు లాక్కొంచ్చింది.
అలా బయటకొచ్చిన కుక్కను యజమాని గుడ్ బాయ్ అంటూ మెచ్చుకున్నాడు. కుక్క వల్ల జింకపిల్ల ప్రాణాలతో బయటపడింది. అయితే.. ఇది ఎక్కడ జరిగిందో తెలియలేదు కానీ.. దానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే.. నీటి ప్రవాహంలో చిక్కుకున్న జింకను కుక్క తీసుకువచ్చిన దృశ్యాలను యజమాని వీడియో తీశాడు. దానిని Universal Gyan 4u అనే యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. తర్వాత ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో కూడా షేర్ చేశారు. దాంతో నెటిజన్లు ఆ కుక్క సాహసాన్ని చూసి ముచ్చటపడుతున్నారు. మనుషుల బెస్ట్ ఫ్రెండ్ కుక్కలేనంటూ కొందరు.. ఇది నమ్మలేకపోతున్నామంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.