నగరంలోని బంజారాహిల్స్ లో ఆదివారం నాడు కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. కారును అతివేగంగా నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. మద్యం మత్తులో కారును నడిపినట్టుగా స్థానికులుఆరోపిస్తున్నారు.
బంజారాహిల్స్ లో ఓ టిఫిన్ సెంటర్ వద్ద టిఫిన్ కోసం నిలబడి ఉన్నవారిపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టిఫిన్ సెంటర్ వద్ద నిలిపి ఉన్న మూడు కార్లు కూడా ధ్వంసమయ్యాయి.
కారులో ఉన్న ప్రణవ్, వర్ధన్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును మద్యం మత్తులో నడిపినట్టుగా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రతి రోజూ ప్రతి పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
వేగంగా వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతే కాదు డ్రైవింగ్ సమయంలో నిర్లక్ష్యం, మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడం వంటి పరిణామాలు కూడా ప్రమాదాలకు కారణంగా పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు.