తెలంగాణలో రాజకీయాలు రాజ్ భవన్ చుట్టూ తిరుగుతూ హీట్ ను పుట్టిస్తున్నాయి. సర్కార్ వర్సెస్ గవర్నర్ గా నడుస్తున్న కోల్డ్ వార్ కాస్త ఓపెన్ వార్ గా మారిపోవడంతో మాటలయుధ్దం తారాస్థాయికి చేరుకుంటోంది. ఈ క్రమంలోనే గవర్నర్ తమిళిసై పై అగౌరపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది.
సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సరూర్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక మహిళా గవర్నర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్ మహిళా లోకంపైన వ్యాఖ్యలుగా భావించడం, అందరిని అవమానపరిచినట్లే అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇలాంటి మూర్ఖుడు ప్రజా ప్రతినిధిగా ఉండడానికి వీలు లేదని , తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేయడం జరిగింది.
అయితే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని మండిపడ్డారు. ఒక్క ఫైల్ ను కూడా కదలనివ్వడం లేదని ఆరోపించారు. దీనిపై ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. గవర్నర్ అసెంబ్లీ, కౌన్సిల్ లో పాస్ చేసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా తన సీటు కింద పెట్టుకొని కూర్చుంటారా అంటూ అనుచిత పదజాలాన్ని ఎమ్మెల్సీ ఉపయోగించడం ఇప్పుడు తీవ్ర దుమారానికి దారి తీస్తోంది. ఇలా ఓ మహిళా గవర్నర్ పట్ల మాట్లాడడం రాజ్యాంగమా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఇలా ఉంటే గవర్నర్ తెలంగాణ సర్కార్ పై కేంద్రానికి లేఖ రాయడం మరింత పీక్స్ కు తీసుకెళ్లుతుంది వివాదాలను. కరోనా రూల్స్ ..సీఎం సభకు వర్తించవా అని ఆమె ఆ లేఖలో ప్రశ్నించారు. ఆ సభకు 5 లక్షలమంది వచ్చేలా ఏర్పాట్లు చేశారని ఆమె పేర్కొన్నారు, కలెక్టర్, ఎస్పీ సహా అధికారులపై చర్యలు తీసుకునే అధికారం తనకు ఉందని, కానీ ఎవరో ఆదేశిస్తే వారిని శిక్షించడం సరికాదన్నారు. నా వల్ల వారికి బ్లాక్ మార్క్ రావడం నాకిష్టం లేదు.. నిజానికి ప్రోటోకాల్ విషయాలకు సంబంధించి కేంద్రం సూచించిన మార్గదర్శకాలను ఈ ప్రభుత్వం పాటించడం లేదు అని తమిళసై ఆరోపించారు. రిపబ్లిక్ దినోత్సవ వేడుకల నిర్వహణపై రెండు నెలల క్రితమే తాను రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా స్పందన లేదని ఆమె తెలిపారు. మొత్తానికి కేసీఆర్ సర్కార్ వర్సెస్ గవర్నర్ తమిళి సై నడుస్తున్న వార్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తోందనన్న చర్చ జరుగుతుంది.