హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మంటలు చెలరేగడం ఆందోళనకు గురి చేస్తోంది. సికింద్రాబాద్ డెక్కన్ మాల్ బిల్డింగ్ లో భారీ అగ్నిప్రమాదం నగరవాసులను బెంబేలెత్తించింది.
ఆ తర్వాత కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. తాజాగా సికింద్రాబాద్ లోని రైలు నిలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైల్ నిలయం ఓల్డ్ క్వార్టర్స్ దగ్గర ఖాళీ స్థలంలో మంటలు అంటుకున్నాయి. అవి క్షణాల్లోనే భారీగా చెలరేగాయి.
దీంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది. అయితే, ఖాళీ స్థలంలో కొన్నేళ్లుగా చెత్తా చెదారం పేరుకుపోయింది. చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు ఎగసిపడ్డాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.