తల్లిదండ్రులు సెల్ ఫోన్ కొనివ్వలేదని ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. సెల్ ఫోన్ కోసం ఆఖరికి ప్రాణాన్నే వదిలేసింది. ఈ ఘటన నిజామాబాద్ లో చోటు చేసుకుంది. నగరంలోని మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్ లో శివాని అనే బాలిక గురువారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
శివాని అనే బాలిక(16) పదో తరగతి చదువుతూ మధ్యలోనే ఆపేసింది. చదువుకోవాలని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినలేదు. అందులోనూ తనకు సెల్ ఫోన్ కొనివ్వాలని గత కొద్ది రోజులుగా పేరెంట్స్ ని అడుగుతూనే ఉండేది.
అందుకు తల్లిదండ్రులు నిరాకరించడంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక సెల్ ఫోన్ కోసం తన ప్రాణాన్ని వదిలేసింది బాలిక. ఈ ఆత్మహత్యా ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.