మనుషులే కాదు పక్షులు కూడా గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించగలవని నిరూపించింది ఓ బార్ టెయిల్డ్ గాడ్విట్ బర్డ్. ‘లిమోసా లప్పోనికా’ అనే శాస్త్రీయ నామం గల ఈ అరుదైన పక్షులు ఆగకుండా సుదూర ప్రాంతాలకు ప్రయాణించగలవు. అయితే ఓ బర్డ్ తన దరిదాపుల్లోకి మరే పక్షీ రాలేనంతగా ప్రయాణించి తన పేరిట ఓ గిన్నీస్ రికార్డ్ నమోదు చేసుకుంది. దాదాపు 11 రోజులు ప్రయాణించి 13 వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటేసింది.
అమెరికా రాష్ట్రం అలస్కాలో బయలుదేరిన ఆ పక్షి.. 11 రోజుల తర్వాత ఆస్ట్రేలియాలోని టాస్మానియాకు చేరుకుని అందరి చేత ‘జౌరా’ అనిపించింది. ది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. గత ఏడాది అక్టోబర్ 13న 234684 ట్యాగ్ నెంబర్ తో ఉన్న పక్షి అమెరికాలోని అలస్కా రాష్ట్రం నుంచి బయలుదేరింది.
అలసటను భరిస్తూ.. ఆకలి దప్పికలను జయిస్తూ.. పదకొండున్నర రోజులపాటు గాల్లోనే పయనిస్తూ.. 13,560 కిలోమీటర్ల(8,435 మైళ్లు) సుదీర్ఘ ప్రయాణం చేసి.. ఆస్ట్రేలియాలోని టాస్మానియా రాష్ట్రంలో కిందకు దిగింది. దాంతో 2020లో మరో గాడ్విట్ పక్షి పేరిట ఉన్న 217 మైళ్ల ప్రయాణ దూరం రికార్డ్ ను తిరగరాసినట్లయింది. పక్షి వీపునకు దిగువన తోక భాగానికి కొద్దిగా పైన అమర్చిన 5జీ శాటిలైట్ ట్యాగ్ ద్వారా దీని ప్రయాణ దూరాన్ని రికార్డు చేశారు.
ఈ పక్షి ప్రయాణించిన దూరం లండన్, న్యూయార్క్ నగరాల మధ్య రెండున్నర ట్రిప్పులకు సమానమని, భూ గ్రహం చుట్టుకొలతలో 1/3వ వంతు అని గిన్నీస్ బుక్ ప్రతినిధులు తెలిపారు. రేయింబవళ్లు ప్రయాణించడం ద్వారా ఈ గాడ్విట్ బర్డ్ తన బరువులో సగానికిపైగా కోల్పోయిందని టాస్మానియాకు చెందిన పక్షి సంరక్షకుడు ఎరిక్ వోహ్లర్ చెప్పారు.
ఇతర పక్షులు వలస వెళ్తూ మార్గమధ్యంలో నీటి ఉపరితలాలపై వాలుతూ ఆహారం తీసుకుంటాయి. కానీ, గాడ్విట్ బర్డ్ నీటి ఉపరితలం వాలితే ప్రాణాలు కోల్పోతుంది. ఎందుకంటే ఈ పక్షుల కాలి వేళ్ల మధ్య చర్మం లేకపోవడంవల్ల నీటి ఉపరితలంపై వాలితే మునిగిపోతాయి. సముద్రాల మీదుగా వలస వెళ్లేటప్పుడు అలసిపోవడం కారణంగానో, ప్రతికూల వాతావరణం కారణంగానో నీళ్లలో పడితే ఇక అంతే సంగతులు.