తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగ జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు మంగళవారం శ్రీదేవీ, భూదేవీ సమేత మలయప్పస్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగింది.
రథోత్సవంలో భారీగా భక్తులు పాల్గొని స్వామి వారి రథాన్ని లాగారు. ఆలయ వీధుల గుండ మలయప్ప స్వామి ఊరేగుతుండగా భక్తులు నీరాజనాలు సమర్పించారు. రథోత్సవం సందర్బంగా తిరుమల మాఢ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారు మోగి పోయింది.
అంతకు ముందు ఉదయం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారాన్ని అర్చకులు తెరిచారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంతో స్వామి వారిని అర్చకులు మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలను అర్చకులు నిర్వహించారు.
సోమవారం 82,815 మంది భక్తులు తిరుమల స్వామి వారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. 27,147 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. రూ. 3.05 కోట్లను భక్తులు హుండీ ద్వారా స్వామి వారికి కానుకలుగా సమర్పించినట్టు తెలిపారు.