రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దండయాత్ర ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ కు సంబంధించిన భావోద్వేగ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిరాశకు గురైన నివాసితులు సురక్షితమైన ఆశ్రయం పొందే ప్రయత్నంలో దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో హృదయాన్ని కదిలించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఒక తండ్రి తన కుమార్తెను సురక్షిత ఆశ్రయం కోసం వేరే ప్రాంతానికి పంపించేందుకు బస్సు ఎక్కిస్తున్నప్పుడు ఆమెకు వీడ్కోలు పలికాడు. ఆ తండ్రి తన కూతురి తలపై టోపీని బిగించి, గట్టిగా కౌగిలించుకుని విడిపోతున్నట్లు ఉండే సన్నివేశం హృదయాలను కదిలిస్తోంది.
సీఎన్ఎన్ నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి తన దేశాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నందున ఆమెతో పాటు వెళ్లలేదని తెలుస్తోంది. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా తమ దేశాన్ని రక్షించుకోవాలనుకునే ఉక్రెయిన్ పౌరులందరికీ ప్రభుత్వం ఆయుధాలను అందజేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ చెప్పారు.
రష్యాలో తమ మనస్సాక్షిని ఇంకా కోల్పోని వారందరికీ.. ఉక్రెయిన్ తో యుద్ధానికి వ్యతిరేకంగా బయటకు వెళ్లి నిరసన తెలియజేయాల్సిన సమయం ఇది. తమ చేతుల్లో ఆయుధాలతో ప్రాదేశిక రక్షణలో భాగంగా మన దేశాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్న ఉక్రెయిన్ పౌరులందరిపై మేము ఆంక్షలను ఎత్తివేస్తాము అని వోలోడిమిర్ స్పష్టం చేశారు.